ఒకవైపు కృష్ణమ్మ ఉగ్ర రూపం..మరొకవైపు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తిపోతుంది. బుడమేరు కన్నెర్ర చేసింది. దీంతో కనుచూపు మేరా నీరే విస్తరించడం వల్ల.. లక్షలాదిమంది వరద బాధితులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం సహాయక చర్యల్లో మునిగిపోయింది. దీంతో విజయవాడలో వరద ముంపునకు అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా నిర్ణయాలతో పాటుగా 20 ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ముంచేసిందన్న ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
విజయవాడను బుడమేరు ముంచేయడంతో.. జనజీవనం అస్తవ్యస్తం అయింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్నా పెద్ద వాగులను కలుపుకొని ఒక్కసారిగా విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయి విజయవాడ నగరాన్ని ముంచేసింది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతోనే
ఇప్పుడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి బుడమేరు ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిపోయాయి. బుడమేరు ప్రవాహం విజయవాడ సిటీలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ కరకట్ట ఆనవాళ్లు కూడా ఇప్పుడు లేవు. కొన్నేళ్లలోనే కాలనీలకు కాలనీలను విస్తరించాయి. దీనిలో అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా పాత్రధారులుగానే ఉన్నారు. విజయవాడలో విపరీతంగా చేపట్టిన ఆక్రమణలతో భారీగా వచ్చిన వరద ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. దీంతో, బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయి సిటీని ముంచెత్తింది.
భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇబ్రహీంపట్నం మండలంలోని తలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది. వెలగలేరు వంతెన వద్ద 11 షట్టర్లను 11 అడుగుల వరకూ ఎత్తి దిగువకు నీటిని వదలటంతో ఆ ప్రభావం విజయవాడ సిటీపైన గట్టిగానే పడింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని..కష్ణ వరద వెనక్కుతన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. దీంతోనే పైనుంచి ఒత్తిళ్లు రావటంతో.. చివరకు వెలగలేరు షట్లర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తారు. దీనివల్ల కూడా విజయవాడను వరద ముంచెత్తినట్లు వార్తలువ వినిపిస్తున్నాయి.