గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కి చెక్ పడినట్లే అనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ & DCMకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే @పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెష్ తెలిపారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెర పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ నంద్యాల ఎపిసోడ్ తరువాత మెగా ఫ్యాన్స్, జన సైనికులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. శిల్పా రవి పిలవకపోయినా తానే వెళ్లి ప్రచారం చేశానని బన్నీ చెప్పడంతో మరింతగా అగ్గి రాజేసినట్టు అయింది. అలా జన సేన, పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం బన్నీ వెళ్లడంతో నానా రచ్చ జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడి ఘన విజయం సాధించి కింగ్ మేకర్ అయ్యారు. ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్‌ను కలిసింది లేదు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు ప్రచారం సాగింది. ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్దం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు.
వీరికి కౌంటర్‌గా అల్లు అర్జున్ ..నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది. అయితే తాజాగా ఈ వార్‌కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ ట్వీట్ పై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. పవన్ కు విషెస్ తెలిపిన ట్వీట్ లో ఆయన్ను ఏక వచనంతో సంబోధించారని ఏదో మొక్కుబడిగా ట్వీట్ చేశారని అంటున్నారు. మరి అల్లు అర్జున్ పవనకు బర్త్ డే విషెష్ తర్వాత అయిన అభిమానులు ఈ యుద్దాన్ని ఆపుతారో లేదో చూడాలి.