అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస వైఫల్యాలను చవిచూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్.. త్వరలో పెళ్లి చేసుకుంటే మంచిదని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రత్యేక సలహా ఇచ్చాడు. పెళ్లి తర్వాత బాబర్ అజామ్ పూర్తిగా భిన్నమైన బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తాడని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. పెళ్లి చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పరుగులు సాధించేందుకు అవసరమైన అదృష్టాన్ని తిరిగి సంపాదించుకోవచ్చని చెప్పాడు.
బాబర్ ఆజం తన పెళ్లి గురించి తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. పెళ్లి తర్వాత బాబర్ పూర్తిగా భిన్నమైన బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తాడు. వైఫల్యం ఆటగాడిని ఎలా ప్రభావితం చేస్తుందో నాకు బాగా తెలుసు. కాబట్టి బాబర్ తల్లిదండ్రులు అతనికి త్వరలో వివాహం చేయాలి. ఒక అన్నయ్యగా నేను అతని పెళ్లిని చూడాలనుకుంటున్నాను.. మీకు సరైన వయస్సు వచ్చింది.. త్వరలో పెళ్లి చేసుకోండి బాబర్ ఆజం” అని బాసిత్ అలీ యూట్యూబ్ షోలో తెలిపారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు స్వదేశంలో 0-2 తేడాతో క్లీన్ స్వీప్ ఓటమిని చవిచూసింది. ఈ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ ఓటమికి స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణం. ఈ సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బాబర్ 64 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 32. ఫలితంగా బంగ్లాదేశ్ తో టెస్టు చరిత్రలో తొలిసారిగా సిరీస్ కోల్పోయింది పాకిస్థాన్. 29 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం తన చివరి 16 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి నుంచి పాక్ జట్టు ఆటగాళ్లు పెద్ద గుణపాఠం నేర్చుకున్నారని.. ఇది కచ్చితంగా పాక్ జట్టును షాక్‌కి గురి చేస్తుందని.. ఇంతకంటే దారుణమైన పరిస్థితిని పాకిస్థాన్ జట్టు ఎదుర్కోలేదని.. ఆ తర్వాత కూడా ప్రదర్శన స్థాయి మెరుగుపడకుంటే.. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లతో టెస్టులు ఆడేందుకు ఈ ఓటమి పాక్ జట్టుకు కళ్లు తెరిపిస్తుంది’ అని అలీ పేర్కొన్నాడు. ICC టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ జట్టు, అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను ఆడనుంది.