ఖమ్మం జిల్లాను ఎన్నడూ లేనంతగా వరదలు ముంచేశాయి. మున్నేరు వరదలు ఈ స్థాయిలో రావడంపై వివద రకాలుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక రకంగా చెప్పాలి అంటే క్లౌడ్ బరస్ట్ అయ్యింది. అత్యధిక వర్షపాతం గంటల వ్యవధిలో రావడం, మున్నేరులో కలిసే చెరువులు, కుంటలు, వాగులు చాలా వరకు తెగిపోయి వరద ఒక్కసారిగా మున్నేరులో కలవడంతో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ చెరువులు, కుంటలు, చాలా వరకు కబ్జాలకు గురి అవ్వడంతో వీటి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గి పొంగి మున్నేరులో కలిసాయి.
నిజానికి మున్నేరు పరివాహక ప్రాంతం చాలా వరకు బపర్ జోన్ ఈ ప్రాంతంలో నివాస స్థలాలకు అనుమతి ఇవ్వకూడదు. కానీ మున్నేరుని అనుకోని ఇబ్బడి ముబ్బడిగా నివాస స్థలాలు ఏర్పడ్డాయి, బపర్ జోన్ లో నివాస స్థలాలకు అనుమతి ఇవ్వకపోతే ఇంత స్థాయిలో నష్టం వాటిల్లేది కాదు. ఇక మరో అంశం కూడా స్థానికులు చెప్తున్నారు, ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యాం నిర్మించడం వల్ల 6 అడుగులు మేర నీరు వెనక్కి పోటు వేసిందని అంటున్నారు. ఈ నీరే నీరు ఖమ్మంలోకి వెళ్లిందని.. చెక్ డ్యాం అక్కడ కట్టకుండా ఉంటే ఈ స్థాయిలో వరద నీరు ఖమ్మం లోకి వెళ్ళేది కాదని అంటున్నారు.
మొత్తంగా ఖమ్మం వరదలు.. కచ్చితంగా మానవ తప్పిదాలు వల్ల జరిగిందేనన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు సంభవించకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం వాసులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఖమ్మం అనేది సురక్షిత ప్రదేశంగా ఎలా ఉందో భవిష్యత్తులో కూడా అలా ఉండాలంటే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ద చూపించాలనేది నిపుణుల మాట. ఖమ్మంలో ఆక్రమణలు తొలగింపుతో పాటు, మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా మరోవైపు ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యాంపై కూడా నిర్ణయం తీసుకుని, ఖమ్మం నగరాన్ని వరద ముంపు నుండి కాపాడగలరని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.