తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 20న సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక విషయాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడంతో పాటు.. పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి సంబంధించి కొన్ని అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న వారికి ఇంకా రుణ మాఫీ కాలేదు. దీంతో వారికి దశల వారీగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేబినెట్ ఆమోదం కావాలి. రైతుబంధు స్థానంలో ఇకపై రైతుభరోసాను పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన అమలు, పరిమితులపై అభిప్రాయాల సేకరణను జిల్లాల వారీగా చేపట్టనుంది.
వర్షాకాలం ముంగిపు దశకు చేరుకున్నా సరే రేవంత్ సర్కార్ పూర్తిగా రైతు భరోసాను అమలు చేయకపోడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతోనే ఇప్పుడు రైతు భరోసా పైన కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతో పొలంలో పంటలు వేసారో వారికి డబ్బులు ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా దీనిపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ నెలలో ఎలా అయినా సరే రైతు భరోసా డబ్బులను రైతులందరి ఖాతాల్లో జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని కూడా తెలంగాణలోనూ అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటింది. దీంతో రైతులకు సంబంధించి ఈ కేబినేట్ భేటీ కీలకంగా మారనుంది.