వాహనాలను తయారు చేసి 15 సంవత్సరాలు దాటితే అవి ప్రమాదకరంగా,కాలుష్య కారకంగా మారతాయని నిపుణులు పదే పదే చెబుతూనే ఉంటారు. అందుకే ఇకపై ఇటువంటి వాహనాలు రోడ్లపై తిరిగితే ఉపేక్షించవద్దని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 15 సంవత్సరాలు దాటిన వాహనాలతో వెయ్యి రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 2022లో ఈ వాహనాలతో 1,306 ప్రమాదాలు జరగగా.. ఈ ప్రమాదాల్లో 418 మంది చనిపోయారు. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వాహనాలు తరచూ పాడైపోతున్నాయని, వాయు కాలుష్యాన్ని కూడా పెంచుతున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.
దీంతో వాహనాల జీవిత కాలపరిమితిపై 2025 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాహనాలను కొనుగోలు చేసి 15 సంవత్సరాలు దాటితే వాటిని వెంటనే తుక్కు కింద మార్చాలి. అలాగే, వాటి రిజిస్ట్రేషన్ కూడా ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది.
ఎలాంటి వాహనాలకయినా సరే ఇది వర్తిస్తుంది. అయితే వాహనాల యజమానులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది ఆ వాహనాన్ని స్క్రాప్‌కి ఇచ్చేయాలి. అలా కాకుండా అలాగే ఆ వాహనాలతోనే రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రెండోది.. ఫిట్‌నెస్ పరీక్షలో ఆ వాహనం పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి, ఆ వాహనాన్ని అదనంగా 3-5 సంవత్సరాలు వాడుకోవడానికి అనుమతిని పొందవచ్చు. అయితే, 15 ఏళ్లు నిండిన తర్వాత స్క్రాప్ చేయాల్సిన సుమారు 10 వేల ప్రభుత్వ వాహనాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదట.
ఇప్పటికే ఈ మేరకు ప్రాంతీయ రవాణా అథారిటీ వెహికల్ స్క్రాపేజ్ విధాన ముసాయిదాను ..సిద్ధం చేసి దాని ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇప్పటి వరకూ 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించని ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో సహా కొన్ని రాష్ట్రాలు తెలంగాణలో ఇప్పుడు ప్రతిపాదించిన విధానం వంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి.
ప్రస్తుతం 15 సంవత్సరాలు దాటిన వాహనాలు తెలంగాణలో 30 లక్షలకు పైగానే ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 సంవత్సరాలు నిండిన వాహనాలు 21 లక్షలకు పైనే ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు ఉండగా, 3.5 లక్షల కార్లు అలాగే లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
అంతేకాదు 15 ఏళ్లు దాటిన వాహనాల జాబితాలో వెయ్యి ఆర్టీసీ బస్సులుండగా… పలు విద్యా సంస్థల బస్సులు 2 వేలు 15 ఏళ్లు దాటినట్టుగా అధికారులు గుర్తించారు. పాత వెహికల్స్ ను స్క్రాప్ చేసిన యజమానులకు మోటార్ వాహనాల పన్నుపై 10 నుంచి 15 శాతం వరకు రాయితీని ఇచ్చే అంశాన్ని తాజాగా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.