తిరుమల లడ్డూ కల్తీ ఘటనతో కలత చెందానంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ స్వయంగా ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో.. శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ నిర్వహించారు. ఎంపీలు కేశినేని శివనాథ్ , బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దుర్గ గుడి శుద్ధి తర్వాత.. మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్..అక్టోబర్ 1న పవన్ తిరుమల వెళ్లి, అక్టోబర్ 2న అక్కడ దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. కాగా తిరుమల లడ్డూపై సోమవారం వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని అన్నారు.
తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలి కానీ.. అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ సూచించారు. తాను ఏ మతంపైనా విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు. దేవతా విగ్రహాలు ధ్వంసమవుతున్నప్పుడు తాను ఎలా నిశ్శబ్దంగా ఉంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అసలు సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కి ఈ విషయంతో సంబంధం ఏంటని పవన్ సూటిగా ప్రశ్నించారు.
సనాతన ధర్మంపై ఎవరూ కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేయకూడదని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే మాత్రం తాను అస్సలు ఊరుకోబోనని పవన్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు తప్పు చేసి కూడా రివర్స్‌లో మాట్లాడుతున్నారని, మౌనంగా ఉండకూడదనే అహంకారంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూనే, హిందువులను అవమానిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని తేల్చి చెప్పారు.