సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాక్..

Karnataka High Court Big Shock to CM Siddaramaiah

కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న భారీ కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది.  సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు ఆమోదించింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చర్యను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సీఎంపై విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ అవసరమని, గవర్నర్ ఇచ్చిన అనుమతి సరైనదేనని హైకోర్టు పేర్కొంది.

ఈ నేపథ్యంలో సీఎంపై ఎలాంటి విచారణ చేయవచ్చు? లోకాయుక్త విచారణకు అనుమతించవచ్చా? లేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించవచ్చా? అనేవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముడ అక్రమాలపై ఐఏఎస్ అధికారి వెంకటాచలపతి నేతృత్వంలో కమిటీ వేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను కూడా నియమించింది. అయితే, ఇంతకుముందు, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, ఎవరిపై అభియోగం మోపబడిందో, వారే దర్యాప్తు తీరును నిర్ణయించడం చట్టబద్ధం కాదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని గవర్నర్ పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్త టి. జె. అబ్రహం ఈ ఏడాది జూలై 18న మైసూరులోని లోకాయుక్త పోలీసులకు సీఎం సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారు. సీఎం సిద్ధరామయ్య తన భార్య బి. ఎం.పార్వతి కి జనవరి 5, 2022న అక్రమంగా 14 ముడా సైట్లు కేటాయించారని తన ఫిర్యాదులో వివరించారు. మైసూరులోని విజయనగరంలో పరిహారం రూపంలో ఈ ప్లాట్లను కేటాయించారని, దీంతో రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, సిద్ధరామయ్య కుమారుడు, వరుణ ఎమ్మెల్యే ఎస్. యతీంద్ర, మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ డి. బి. నటేష్, ముడ అధినేత హెచ్. వి. రాజీవ్ పేర్లను పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగానే ముడా స్కాం దర్యాప్తు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ లోకాయుక్తకు ముడా కుంభకోణం దర్యాప్తును అప్పగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైకోర్టు తీర్పు ఇప్పుడే వెలువడింది, ముడా కుంభకోణంపై లోకాయుక్తలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించవచ్చు.

సీబీఐ విచారణకు బీజేపీ నేతలు డిమాండ్

ముడా కుంభకోణం బయటపడినప్పటి నుంచి సీఎంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి. వై. విజయేంద్ర, శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ డిమాండ్ చేస్తున్నారు.

సీఎం రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమయ్యారు. న్యాయపోరాటం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సుప్రీంకోర్టును సవాల్ చేసేందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సిద్ధమైంది. కేబినెట్ మొత్తం సీఎం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ కేసు మొత్తం రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.