హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థ చెరువుల ఆక్రమణలు, ఎఫ్టిఎల్ పరిధి, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలపైన కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో హైడ్రా భాదితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. తాను బుల్డోజర్లకు అడ్డంగా ఉంటానని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ హయాంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించినట్లు తెలిపారు. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రుల ఇళ్ళు ఎఫ్.టి.ఎల్ పరిధిలోను, బఫర్ జోన్ పరిధిలోనూ ఉన్నాయని, ముందు వాటిని కూల్చాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. నిరుపేదలకు ఒక న్యాయమా అంతేకాదు జిహెచ్ఎంసి, బుద్ధ భవన్ నాలాల పైన ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ భూములను అమ్మడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్న కేటీఆర్, హైడ్రా కూల్చివేతల పైన కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం నిరుపేదలకు మరొక న్యాయమా అంటూ ప్రశ్నించారు.
బుల్డోజర్లకు అడ్డుగా తాను ఉంటానన్న కేటీఆర్ నిరుపేదలు హైడ్రా కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నగరంలోని ఎమ్మెల్యేలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. పబ్లిసిటీ స్టంట్ లు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఎక్కువకాలం ప్రభుత్వాన్ని నడపలేదన్నారు.. నిరుపేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే ఒక బాలిక ఉదాహరణ అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్లకు అడ్డుగా తాను ఉంటానని సామాన్య ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
మూసీ శుద్ధి వెనుక మతలబు వేరే అన్న కేటీఆర్ ఇక మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. మూసి సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. మూసిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న కేటీఆర్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎన్టిపిలను ఉపయోగించుకుంటే సరిపోతుందన్నారు. అసలు మూసి ని శుద్ధి చేయడం వెనుక ప్రభుత్వానికి వేరే ఉద్దేశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.