మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సినీ , రాజకీయ ఇండస్ట్రీలలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారంటూ పరిధికి దాటి చేసిన కామెంట్లు కాక రేపాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు.. టాలీవుడ్ ప్రముఖులు చాలామంది తీవ్రంగా ఖండించారు. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్యతో పాటు..పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత చాలా ఎమోషనల్ గా స్పందించారు.
తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని, విడాకులనేవి పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమంత చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మా విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా రాజకీయాల్లో తనను లాగకండి అంటూనే..నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని సమంత చెప్పుకొచ్చింది. సమంతా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్‌కు.. తాజాగా మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు.
తన ఎక్స్ ఖాతాలో సమంతను ఉద్దేశిస్తూ కొండా సురేఖ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక లీడర్ చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు. స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని చెప్పింది. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, సమంతా అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన కొండా సురేఖ ..అన్యదా భావించవద్దని అన్నారు.
అయితే, కొండా సురేఖ కేవలం సమంతను మాత్రమే ఉద్దేశించి మాత్రమే ట్వీట్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాగార్జున, అమల, నాగ చైతన్యతో పాటు ఇతర టాలీవుడ్ నేతల ట్వీట్లకు స్పందించని కొండా సురేఖ సమంతాను మాత్రమే ట్యాగ్ చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయినా ఏది పడితే అది మాట్లాడి నోరు జారడం.. తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పడం సరిపోదని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మాటను వెనక్కి తీసుకోలేమని.. అందుకే ఒక మాట అనే ముందు వందసార్లు ఆలోచించాలని పెద్దలు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బాధ్యయుతమైన మహిళా నేత అయి ఉండి..మరో మహిళపై అలా నోరు జారడంపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.