మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్ననే సమంత నాగచైతన్య విడాకుల అంశాన్ని లేవనెత్తి విమర్శల పాలు అయిన కొండా సురేఖ ఈసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ను చంపేశారేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేదని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్న మంత్రి.. బీఆర్‌ఎస్ ఓటమికి కేటీఆరే కారణం అని విమర్శించారు. పదవీ ఆకాంక్షతోనే కేసీఆర్ ను కేటీఆరే ఏదో చేశారనే ప్రచారం జోరుగా సాగుతుందంటూ ఆమె పేర్కొన్నారు. అతనే సీఎం అనుకుని కేటీఆర్ పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ‘అసలే కేటీఆర్‌కు పదవీ కాంక్ష ఎక్కువ. లోపల ఎమన్నా బొండిగె పిసికి సావగొట్టిండో.. తలకాయ పగలగొట్టిండో తెల్వది. మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తది కాబట్టి.. మనమందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన బాగుండాలని కోరుకుందాం’ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఏ రేంజ్ లో రియాక్షన్ ఇస్తుందో చూడాలి.
మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా సమంత-నాగచైతన్యలపై నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక కొండా సురేఖకు మతిభ్రమించిందని కేఏ పాల్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలనన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే.. కేసు వేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. కొండా సురేఖ కామెంట్స్‌పై ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కొండా సురేఖ స్పందించారు ‘ఆవేదనతోనే విమర్శలు చేశా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి కొండా సురేఖ అన్నారు.