పోలవరానికి కేంద్రం గుడ్ న్యూస్ రూ.2,800 కోట్లు విడుదల

Centre Grants ₹2,800 Crore for Polavaram Project Development

ఏపీలోని Polavaram Project సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలవరం కోసం మోడీ సర్కార్ 2,800 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. పాత బిల్లుల రీయింబర్స్ మెంట్ కింద 800 కోట్లు రూపాయలు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు 2000 కోట్లు రూపాయలను విడుదల చేసింది.

మరోవైపు కేంద్ర సహకారంపై ఇరిగేషన్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నిధుల మంజూరు కావడం ఇదే తొలిసారి అంటూ జలవనరుల శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2014 నుంచి ఏపీ ప్రభుత్వం ముందుగా సొంత నిధులతో పనులు చేయిస్తుంటే.. వాటికి దశలవారీగా కేంద్ర ప్రభుత్వం డబ్బు చెల్లిస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6వేల కోట్ల రూపాయలు, వచ్చే ఏడాది 6,157 కోట్లు రూపాయలు మంజూరు చేయడానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలాఉంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లడమే కాకుండా అక్కడ ఉచితంగా భోజనాల సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించిన నిధులను.. 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు కాంట్రాక్టర్ ఖర్చు చేసిన వాటిని కాంట్రాక్టర్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించలేదు.

దీంతో ఆ కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా.. 12శాతం వడ్డీతో ఆ నిధులను చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం వాటికోసం 23.11 కోట్ల రూపాయల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.