ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటే, వేలం ప్రక్రియ కంటే ఉత్కంఠభరితంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఐపీఎల్ కమిటీ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలను తమ జట్టులో ఐదుగురు అంతర్జాతీయ మరియు ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించింది. కాగా ఆయా జట్లు అక్టోబర్ 31 లోగా తుది నిర్ణయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది.
ముంబై జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను ఫ్రాంచైజీ ఉంచుకుంటుందా లేదా మెగా వేలంలో రిటైన్ సిస్టమ్‌తో తీసుకుంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 2024 మెగా వేలానికి ముందు, హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ ట్రేడ్ విండో ద్వారా 17.5 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కట్టబెట్టింది. దీంతో జట్టుకు ఐదుసార్లు ట్రోఫీని అందించిన హిట్ మ్యాన్ ను కాదని హార్దిక్ కు కెప్టెన్సీ అప్పజెప్పడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా వేలం కోసం వేచి ఉండలేను: హర్భజన్ సింగ్
ఇదిలా ఉండగా, టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన హర్భజన్ సింగ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపిఎల్ వేలానికి వస్తే, ప్రొసీడింగ్‌లు గతంలో కంటే మరింత ఉత్కంఠభరితంగా ఉంటాయని అన్నారు. ఐపీఎల్ 2025 కోసం, ముంబై ఫ్రాంచైజీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను జట్టులో ఉంచుతుందా లేదా వేలంలోకి పంపిస్తుందా? ఒకవేళ హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే, వేలం ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం. రోహిత్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయని హర్భజన్ పేర్కొన్నాడు.
రోహిత్ పై ప్రశంసలు
ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడి మూడుసార్లు ట్రోఫీని గెలుచుకున్న మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, రోహిత్ లో ఇంకా క్రికెట్ ఆడే సామర్థ్యం చాలా ఉందని అన్నాడు. “ప్లేయర్‌గా మరియు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అతనికి గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. కెప్టెన్‌గా అతనికి అపారమైన ప్రతిభ ఉంది. అతను ఇప్పటికే మ్యాచ్ విన్నర్ గా నిరూపించుకున్నాడు. 37 ఏళ్ల వయస్సులో కూడా అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉందన్నాడు.
ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ కీర్తి
2013 IPL టోర్నమెంట్ మధ్యలో, రికీ పాంటింగ్ నుండి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ అటు బ్యాట్ తో పాటు కెప్టెన్ నైపుణ్యంతో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
అలాగే, వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియాను విజయవంతంగా నడిపించి, టైటిల్‌ను గెలుచుకున్న రోహిత్ శర్మ చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయక నాయకుడిగా మారాడు.