వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలకు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చాలా చోట్ల చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి.దీనికి తోడు తుపాన్ ముప్పు ముంచి ఉందన్న అధికారుల హెచ్చరికలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు ఏపీకి కూడా తుపాను హెచ్చరికలు జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుంది. అక్టోబర్ 13 నుంచి 15వ తేదీలోగా ఇది మరింత బలపడి తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
నిజానికి ప్రతి ఏడాది అక్టోబర్‌లో ఏపీలో తుపాన్ ముప్పు తీవ్రంగానే ఉంటుంది. గత తుపానుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. అందుకే అక్టోబర్ నెల పేరు వింటేనే ఏపీ ప్రజలు వణికిపోతారు. తాజాగా వాతావరణశాఖ తుపాను హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 12 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.