ఎన్నికల సమయంలో పార్టీలన్నీ వరుసగా ఉచిత హామీలు గుప్పించడం సర్వసాధారణం మారిపోయింది. ఇదే విషయమై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ అనంతరం కోర్టు… ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలను లంచాలుగా పరిగణించాలంటూ కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన లాయర్ శశాంక్ జే శ్రీధర దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న బెంచ్.. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసులతో కలిపి విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి తాజాగా నోటీసులు జారీ చేశారు.
లోక్‌సభ, అసెంబ్లీ సహా ఇతర ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలు తమ గెలుపు కోసం ఇచ్చే ఉచిత హామీల కారణంగా ఆయా ప్రభుత్వాల ఖజానాపై మోయలేని భారం పడుతోందని తన పిటిషన్లో లాయర్ శశాంక్ జే శ్రీధర తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఉచితాలపై గతంలో దాఖలైన వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.