మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు ల ఫోటో మార్ఫింగ్ కేసు లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖను ఆహ్వానిస్తూ ఎంపీ రఘునందన్ రావు ఆమెను స్వాగతించే క్రమంలో బీజేపీ నేత, మెదక్ చేనేతలు నూలు దారంతో తయారు చేసిన దండ వేశారు ఎంపీ రఘునందన్ రావు. అయితే.. దీనిపై కొందరు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ చేయడమే కాక వారిద్దరి ఫోటోలను మార్ఫింగ్ చేసి నానా రచ్చ చేసారు. అసభ్యకరమైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొండాసురేఖ కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఓ మహిళను ఇలా చేయొచ్చా..? అని ప్రశ్నించారు. ఇక దీనిపై రఘునందన్ పోలీసులకు పిర్యాదు చేసారు.
అంతే కాదు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్‌తో పాటు దుబ్బాక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదే వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కేటీఆర్ ఉన్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు కొండా సురేఖ. మహిళలపై కేటీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు మొదటి నుంచి చులకన చూపేనని ఆరోపించారు. ఇదే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ ఘాటు ఆరోపణలు కూడా చేయటం.. సర్వత్రా వివాదాస్పదంగా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై.. అటు అక్కినేని కుటుంబం, ఇటు కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన పిటిషన్ మీద కోర్టులో విచారణ జరుగుతోంది.