బండ్లు ఓడలు అవడం.. ఓడలు బండ్లు కావడం జీవితంలో సాధారణం. రాజకీయాల్లో అయితే అది వెరీ కామన్. అధికారం చేతిలో ఉంది కదా అని అంతెత్తున ఎగిరిపడితే..ఆ అధికారం పోయాక అయ్యో..నా పరిస్థితి ఇలా అయిందేంటా అని బాధపడే నేతల్ని ఎంతోమందిని చూస్తూనే ఉంటాం. ఐదేళ్లు అధికారంలో కొనసాగిన వైసీపీ నేతలు.. తాము ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోయారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అలవాటుగా మార్చుకున్నారు. దానికి ఏపీ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పడంతో కిక్కురుమనకుండా మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొడాలి నాని కూడా సేమ్ టూ సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు.
అవును ఒకప్పుడు గుడివాడలో కొడాలి నాని కింగ్. ఏకంగా 20 ఏళ్ల పాటు పార్టీలు మారినా కూడా గుడివాడను మాత్రం తన అడ్డాగా మార్చుకుని రాజకీయాలు నడిపిన సీనియర్ నేతగా బాగానే గుర్తింపు పొందారు. కానీ ఓకే ఒక్క ఓటమి నాని పరిస్ధితిని దారుణంగా మార్చేసింది.ఇన్నాళ్లూ చూసిన నాని ఒక ఎత్తు.. ఐదేళ్లు వైసీపీ పాలనలో చూసిన నాని మరో ఎత్తు అనుకున్నారో ఏమో కానీ నానికి ఓటమిని రుచి చూపించారు అక్కడి ప్రజలు.
టీడీపీ, వైసీపీలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. కంటిచూపుతోనే రాజకీయాలు నడిపాడనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే అదే నానికి ఇప్పుడు అధికారం పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. గుడివాడకు రావాలంటేనే కష్టంగా మారిపోయిన పరిస్ధితుల్లో తాజాగా మరో భారీ షాక్ తగిలింది.
రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా రాజకీయాలలో తన చక్రం తిప్పుతూ.. చిన్న కార్యక్రమం అయినా పెద్ద వేడుకగా జరుపుకునే కొడాలి నానికి గుడివాడ పోలీసులు భారీగానే షాకిచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకుండా చెక్ పెట్టారు. ఈరోజు కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఆయన అనుచరులకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. అంతే కాదు కొడాలి నాని ఫ్లెక్సీలు కూడా కట్టకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
గుడివాడ పట్టణంలో 20 ఏళ్లుగా నాని ఆడిందే ఆట పాడిందే పాటగా సాగేది. అది పోలీసులైనా, రాజకీయ నేతలైనా, రాజకీయమైనా ఏదైనా సరే కొడాలి నాని కన్నుసన్నల్లోనే సాగేది. ఆయన ఎంతంటే అంత. అయితే ఈసారి ఏపీ వ్యాప్తంగా వీచిన కూటమి సునామీలో కొడాలి నాని కొట్టుకుపోయారు. ఆ ఓటమి ప్రభావం ఎలా ఉంటుందో అర్ధం కావడానికి కొడాలి నానికి ఎంతో కాలం పట్టలేదు.ఇప్పటికైనా కొడాలి నాని ఏదీ శాశ్వతం కాదన్న విషయాన్ని ఒంటపట్టించుకుని కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.