మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ పై కేసు నమోదైంది. గతంలో ఓ వీడియో కోసం గంగవ్వతో పాటు సహనటుడు రాజు ఒక చిలకను బంధించి షూటింగ్ చేశారు. దీంతో యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్.. జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగిత్యాల FRO పద్మారావు కేసు నమోదు చేశారు. దీంతో రాజు రూ. 25,000 జరిమానా కట్టినట్లు సమాచారం. ఈ వీడియో కోసం చిలుకను కొండగట్టు దేవాలయం సమీపంలోని ఒక జ్యోతిష్యుడు దగ్గర నుంచి తెచ్చినట్టు సమాచారం.
గంగవ్వపై ఇలా కేసు నమోదు కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే సినిమాల్లో ఇలాంటి సీన్లు వాడినప్పుడు డిస్‌క్లెయిమర్ ఇస్తారు. పక్షులకు, జంతువులకు ఎలాంటి హాని చేయలేదని చెబుతారు. దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి, ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ యూట్యూబ్ కి ఎలాంటి సెన్సార్ లేదు. దీంతో డిస్‌క్లెయిమర్ ఉపయోగించే అవగాహన లేదు. ఈ క్రమంలో ఇప్పుడు గంగవ్వపై సదరు వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త ఇలా కేసు పెట్టడం గమనార్హం.
మై విలేజ్ షో తరువాత పలు సినిమాల్లో నటించిన గంగవవ్వ తరువాత బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఆమె గతంలో బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో మధ్యలోనే వెళ్లిపోయిన గంగవ్వ, ఆ షోతో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ షో కారణంగానే, నాగార్జున చేసిన సహాయం కారణంగా ఆమె సొంతంగా ఇళ్లు కూడా కట్టుకుంది. ఇన్నాళ్లు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ రాణించిన గంగవ్వ మరోసారి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 8లో ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి రెట్టింపు ఎనర్జీతో షోలో రచ్చ చేస్తుంది. ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్‌ని, మరోవైపు థ్రిల్ ని ఇస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.