భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు దిగజారుతున్న వేళ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకి సొంత పార్టీ ఎంపీలే వార్నింగ్ ఇచ్చారు. అక్టోబరు 28వ తేదీలోపు జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి వైదొలగాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారు హెచ్చరించారు. జస్టిన్ ట్రూడో సొంత లిబరల్ పార్టీలోని కొంతమంది ఎంపీలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం అక్కడ హాట్ టాపిక్ అయింది.
అంతేకాకుండాజస్టిన్ ట్రూడో నాలుగో సారి ఇకపై పోటీ చేయవద్దని కూడా లిబరల్ పార్టీలోని కొంతమంది ఎంపీలు కోరినట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటినుంచైనా ప్రధానిగా ట్రూడో ప్రజల మాటను వినాలని కొంతమంది ఎంపీలు అభిప్రాయపడ్డారు. మరి కొంతమంది లిబరల్ పార్టీ ఎంపీలు మాత్రం ఏకంగా అక్టోబర్ 28వ తేదీలోగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టు బడుతున్నారు
తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్..లిబరల్ పార్టీ ఎంపీలు నిజంగా ప్రధాని ట్రూడోకి సత్యాలే చెబుతున్నారా? ఆ సత్యాలను వినాలని భావించే ఉద్దేశం ట్రూడోకి అసలు ఉందా అని వ్యాఖ్యానించారు.
లిబరల్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈ సమావేశం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. 20 మంది శాసన సభ్యులం కలిసి.. వచ్చే ఎన్నికలలోపు ప్రధానిగా ట్రూడో వైదొలగాలని కోరుతూ లేఖపై సంతకం చేశామని మీడియాకు వివరించారు. కాగా, లిబర్ల్ పార్టీలోని 153 మంది శాసనసభ్యులలో 24 మంది ఎంపీలు జస్టిన్ ట్రూడో రాజీనామా కోరుతూ లేఖపై సంతకం చేసినట్లు కెనడియన్ మీడియా తెలిపింది.
మిగతా శాసనసభ్యుల్లో చాలా మంది జస్టిన్ ట్రూడోకి మద్దతు తెలుపుతున్నా కూడా ఇతరుల ఫీడ్‌బ్యాక్‌ను ట్రూడో సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా జస్టిన్ ట్రూడో మాత్రం తమ పార్టీ ఇంకా ఐక్యంగా ఉందని చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా లిబరల్ పార్టీని తానే నడిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.