కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్య ఘటన పైన జీవనరెడ్డి కలత చెందారు. పార్టీలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నట్టు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. మానసిక ఆవేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువ పాటించాలి. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా. సంఖ్యా బలంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని జీవన్ రెడ్డి గుర్తు చేసారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాడారన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాలలో తన అనుచరురుడు గంగారెడ్డిని పట్టపగలే హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరి అండ చూసుకొని గంగారెడ్డిని చంపారన నిలదీసారు. పార్టీ ఫిరాయింపుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.
ఇక టీపీసీసీ చీఫ్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడినా జీవన్ రెడ్డ సరిగ్గా స్పందించలేదు. ఈ సమయంలో జీవన్ రెడ్డితో మాట్లాడే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించారు. తాజా పరిస్థితుల పైన స్పందించిన జీవన్ రెడ్డి పార్టీలో పరిస్థితుల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.