మెట్రోరైలు రెండోదశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు.. పాక్షికంగా పీపీపీ విధానంలో చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 24,269 కోట్ల రూపాయల అంచనాతో ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు మెట్రో విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను అక్టోబర్ 26న మంత్రి మండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 27న ఓ ప్రకటనలో వెల్లడించింది. డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత.. వెంటనే ఆ పనులు మొదలుపెట్టి నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. రెండోదశ పూర్తి అయితే 8 లక్షల మందికి ప్రయాణ సౌలభ్యం కలగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అతి త్వరలోనే డీపీఆర్, ఇతర డాక్యుమెంట్లను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్లు తెలంగాణ సర్కార్ వివరించింది.
మెట్రో రెండోదశలో 116.4 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్లను గుర్తించారు. వీటిలో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల డీపీఆర్ తయారీ ఇప్పటికే పూర్తి అవగా..దీనికి మంత్రిమండలి ఆమోదం పొందింది. మిగిలిన ఒక్క కారిడార్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గానికి క్షేత్రస్థాయి అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం ఆమోదించిన రెండోదశ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 30 శాతం ఖర్చు 7,313 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. కాగా దాదాపు 18 శాతం వ్యయం 4,230 కోట్ల రూపాయలను కేంద్రం భరించనుంది. 48 శాతం 11,693 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యారంటీతో జైకా, ఏడీబీ, ఎన్‌డీపీ వంటి ప్రముఖ సంస్థల నుంచి సేకరించనుంది. అయితే 4 శాతం ఖర్చు 1,033 కోట్ల రూపాయల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇటక మెట్రోరైలు మొదటిదశతోనే దేశంలో ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అయితే ఏడెనిమిదేళ్లుగా ఈ మార్గాల విస్తరణకు గత ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది.