ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలకు ముందు ఒక లెక్క.. ఎన్నికల తర్వాత ఒక లెక్క అన్నట్లే రాజకీయ నేతలు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసి వైసీపీ ఘోర పరాజయం పొందడంతో ఒక్కొక్క నేత పార్టీ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం 11స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీకి ఇక ఫ్యూచర్లోనూ ఇదే నంబర్ కొనసాగుతుందనుకున్నారో ఏమో.. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, చివరకు కార్యకర్తలు కూడా చాలామంది వైసీపీకి బైబై చెప్పి బయటకొస్తున్నారు. ఆళ్ల నాని,బాలినేని, సామినేని ,మోపిదేవి, బీదా మస్తాన రావు వంటి సీనియర్ నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ మంత్రి విడదల రజిని పేరు వినిపిస్తోంది.
తను కూడా అతి త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. విడదల రజనీ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీలో కొన్ని రోజులు యాక్టివ్గానే కనిపించారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ రజనీ సడన్‌గా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఆమె పెద్దగా కనిపించిందీ లేదు.
గతంలో నిత్యం జగన్ వెంట కనిపించే రజనీ… మీడియా సమావేశాల్లో సైతం తన వాయిస్‌ని వినిపించే రజనీ.. ఎందుకో ఈ మధ్య కనిపించడం మానేయడంతో సొంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయట. విడదల రజిని త్వరలో జనసేన పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో..ఆయన ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారట. రజనీ పార్టీ మార్పుపై ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. దీంతో రజిని పార్టీ మారడం ఖాయం అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజనీ పోటీ చేసి విజయం సాధించారు. స్థానిక నేత మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజినికి అప్పుడు జగన్ టికెట్ కేటాయించారు . తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినా కూడా ఆమెకు జగన్ మంత్రివర్గంలో స్థానం లభించింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా విడదల రజినికి వైద్య, ఆరోగ్య శాఖను జగన్ కేటాయించారు.
అయితే గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూర్ వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీ ఓడిపోయారు. దీంతోనే ఇప్పుడు విడదల రజనీ ఇప్పుడు వైసీపీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా..విడదల రజని వర్గం దీనిని ఖండిస్తోంది. ఆమె వైసీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతారని చెబుతోంది. మరి చూడాలి దీనిపై విడదల రజనీ ఎలా స్పందిస్తారో..