కాంగ్రెస్ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపం: హరీష్‌రావు

Congress Negligence And Ill Advised Decisions Are A Curse For Students: Harish Rao

తెలంగాణలో నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం కాబోతుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను సర్కార్ నియమించింది. కులగణన సర్వే పూర్తి అయ్యే వరకు టీచర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్కూళ్లలో పని చేసి.. ఆ తరువాత మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్లి కులగణన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు.

మీ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న నమ్మకం రోజురోజుకీ దిగజారుతున్నది. మీ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ నవంబర్ 1వ తేదీన విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారే. అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. పిల్లల చదువులు కుంటుపడటంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.