ఏపీలో మహిళలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. తనపై, హోంమంత్రి అనితపై, డిప్యూటీ సీఎం పవన్‌పై కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. పవన్‌పైనే కాదు, ఆయన పిల్లలపైనా వ్యాఖ్యలు చేశారన్నారు.. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా.. చర్యలు తీసుకోవాల్సిందే. అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికారం పోయాక వైకాపా నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెప్పుడూ రాజకీయం చేయనని, తనను మోసం చేయాలనుకుంటే వదిలిపెట్టనని చంద్రబాబు తెలిపారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ఇక ఖబడ్దార్ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొవ్వు ఎక్కువై నేరస్తులుగా తయారవుతున్నాయని, వారి కొవ్వు కరిగిస్తానని చంద్రబాబు తెలిపారు. రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్)ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు.
ఇక నిన్ననే ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీలో మహిళలపై, ప్రభుత్వ పెద్దలపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై నిన్న కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, వీటిపై తన బిడ్డలు సైతం బాధపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. అలాగే వాటిపై చర్యలు తీసుకోని పోలీసులపైనా ఫైర్ అయ్యారు. దీనిపై ఇవాళ తాళ్లాయపాలెంలో స్పందించిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో వాడే భాష చూస్తున్నామని, ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.