భారత దేశంలోని 10 భారతీయ నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత మరణాల రేటును తీవ్రంగా ప్రభావితం చేసిందని లాన్సెట్ అధ్యయనం ఫలితాలను ఎన్జీటీ తీసుకోవడంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వ్యతిరేకించింది. ఆ అధ్యయన డేటాను సెంట్రల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డు అస్పష్టమైనదిగా పేర్కొంది. మరణాలకు కాలుష్యం మాత్రమే బాధ్యత వహించదంటూ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు మించి వాయు కాలుష్యం ప్రతి సంవత్సరం 33,000 మరణాలకు కారణమవుతుందని ఓ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఓ అధ్యయనాన్ని ఎన్జీటీ స్వయంచాలకంగా పరిగణనలోకి తీసుకుని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, పూణే, సిమ్లా, అహ్మదాబాద్, వారణాసి నగరాలను ఆ అధ్యయనంలో చేర్చారు. సెంట్రల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డు నవంబర్ 4 నాటి తన నివేదికలో 2008 నుంచి 2020 మధ్య దేశవ్యాప్తంగా ఒక చదరపు కిలోమీటరుకు పైగా రోజువారీ సగటు పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 సాంద్రతలను విశ్లేషించినట్లు తెలిపింది. దీనిలో 10 నగరాల్లోని ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందుతున్న మరణాల వివరాలను కూడా ఉపయోగించారు. దీంతోపాటు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన పలు కారకాలవల్ల వాయు కాలుష్యం పెరిగిందని ప్రస్తావించారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతున్నదాని ప్రకారం గురువారం ఢిల్లీలో సగటు AQI 377. అంతకు ముందు రోజు 352గా ఉంది. ఛత్ పూజ సమయంలో సాయంత్రం కాలుష్య స్థాయిలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఈ ఏక్యూఐ 382కి చేరుకుంది. ఆందోళనకర పరిస్థితి ఏమిటంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీలోని 16 ఏరియాల్లో ఏక్యూఐ 400 కంటే ఎక్కువగానే నమోదయింది. అంటే గాలి నాణ్యత తీవ్రస్థాయికి చేరుకుంది. వీటిలో ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, ముండ్కా, జహంగీర్‌పురి, వజీర్‌పూర్, ఓఖ్లా ఫేజ్ 2, పంజాబీ బాగ్, రోహిణి, సోనియా విహార్, పట్‌పర్‌గంజ్ వంటి అనేక ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఈ అధ్యయనం డేటా పూర్తిగా సరైనది కాదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెబుతోంది. వాయు కాలుష్యం మరణాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించదని అంటోంది. ఇది మాత్రమే కాదు అధ్యయనంలో ఉపయోగించిన ఉపగ్రహ డేటా, సాంకేతికతలు దేశ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించవని తెలిపింది. డేటా లేకపోవడంతో మరణానికి కారణం కాలుష్యమనేది ఊహాజనితమని తెలిపింది. అయితే ఎన్జీటీ ఓ వార్తాపత్రిక నివేదికను స్వయంచాలకంగా పరిగణనలోకి తీసుకుంది. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను మించి వాయుకాలుష్యం కారణంగా.. ప్రతీ ఏడాది దాదాపు 33 వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ నివేదికలో పేర్కొన్నారు.