లక్నో సూపర్ జెయింట్స్ నుంచి బయటకి రావడానికి కారణం తాను స్వేచ్చగా ఆడటానికే అని తెలిపిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త అవకాశాలను అన్వేషించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేఎల్ లక్ష్యం భారత టీ20 జట్టులో తిరిగి చోటు సంపాదించడం. ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, రాహుల్ తన గత అనుభవాలను పంచుకున్నారు, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉన్న అనుబంధంపై రాహుల్ వెల్లడించాడు.
ఆర్సీబీలో ఆడడం ప్రత్యేక అనుభవం
రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నప్పుడు తాను తన ఆటను చాలా ఆస్వాదించానని తెలిపారు. “ఆర్సీబీ తరఫున ఆడిన రోజులు మరిచిపోలేను. బెంగళూరు నా హోమ్ టౌన్, అక్కడి ప్రజలకు నేను కన్నడ కుర్రాడినని బాగా తెలుసు. ఆ జట్టుతో ఆడటం ఎంతో ప్రత్యేకమైన అనుభవం,” అని చెప్పుకొచ్చాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఓటమి ఇప్పటికీ మరిచిపోలేని సంఘటనగా నిలిచింది. “ఆ మ్యాచ్‌లో ఒకరు చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు, అది జరగలేదు,” అని రాహుల్ తెలిపాడు.
రాహుల్ 2016 ఐపీఎల్ ఫైనల్ గురించి విరాట్ కోహ్లీతో ఎన్నో సార్లు మాట్లాడినట్లు తెలిపారు. “ఆ సంవత్సరంలో, మా ఇద్దరం ఓటమి బాధను ఎన్నో సార్లు పంచుకున్నట్లు తెలిపాడు. ఓటమి గురించి మేము చాలా సార్లు చర్చించాం. ఆ టైటిల్ మా చేతుల్లోకి వచ్చినట్లే వచ్చి చేజారింది అని రాహుల్ అన్నాడు.
స్వేచ్ఛ కోసం
లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన తర్వాత, రాహుల్ మరో కొత్త జర్నీ కోసం ఎదురుచూస్తున్నాడు. “కొన్ని సార్లు దూరంగా ఉంటే మనకు కావాల్సింది దక్కుతుంది. జట్టు వాతావరణం అహ్లాదకరంగా ఉంటే స్వేచ్ఛగా ఆడటాన్ని ఇష్టపడతానని అని రాహుల్ చెప్పాడు. భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, తన ఆటను మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా చెప్పారు. “నేను ఎక్కడ ఉన్నానో నాకు బాగా తెలుసు, మళ్లీ జట్టులో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలో నాకు తెలిసింది. ఈ సీజన్లో సత్తా చాటడం, భారత టీ20 జట్టులో తిరిగి స్థానం పొందడం నా ప్రధాన లక్ష్యం,” అని పేర్కొన్నారు.