డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ మూవీ విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంటూ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. చివరకు 2025 ఆస్కార్ పురస్కారాలకు మనదేశం నుంచి అధికారికంగా ఈ మూవీ ఎంపికయింది. అాయితే ఆస్కార్ క్యాంపెయిన్ మొదలుపెట్టిన మూవీ టీం.. దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులకు ఈ సినిమాను చేరువ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగా ఈ లాపతా లేటీస్ మూవీ టైటిల్‌ను మార్చి లాస్ట్ లేడీస్ పేరును ఖరారు చేసింది. ఈ పేరుతో కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేసింది. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్‌లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా..దీనిలో అమీర్ ఖాన్, కిరణ్ రావు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన వికాస్.. సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
ఆస్కార్ వేడుకలను ఉద్దేశించి అమీర్ ఖాన్ అక్కడి మీడియాతో మాట్లాడారు. 2002 ఏడాదిలో ఉత్తమ విదేశీ చిత్రంగా తాను నటించిన ‘లగాన్’ ఆస్కార్‌కు ఎంపికైందని.. ఇప్పుడు తాను నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ క్యాంపెయిన్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ చలనచిత్రాలు, డాక్యుమెంటరీ ఎంపికకు సంబంధించిన అకాడమీ సభ్యుల్లోనే స్పెషల్ కమిటీలు ఉంటాయని చెప్పారు. తమకు కేటాయించిన వాటిలో 80 శాతం చిత్రాలను మాత్రమే వారు చూస్తారని అమీర్ చెప్పుకొచ్చారు. అందులో మన సినిమా ఉండేలా మనమే ఏదో ఒకటి చేయాలని అన్నారు.
లగాన్’ సమయంలో తమ సినిమా చూసిన వారికి టీ, బిస్కెట్లు ఇచ్చామని గుర్తు చేసిన అమీర్ ఖాన్.. కమిటీ సభ్యులు అన్ని చిత్రాలను వీక్షించాలని నియమం ఏదైనా పెట్టి ఉంటే తాము అవి కూడా ఇచ్చేవాళ్లం కాదన్నారు. ఖరీదైన బహుమతులు ఇచ్చి ఏదైనా చేయొచ్చని చాలామంది అనుకుంటారు కానీ.. అలాంటి వాటికి ఇక్కడ ఛాన్స్ ఉండదు. మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకుని అందరికీ చేరువ చేయాలని అమీర్ చెప్పారు.
2001 కాలపు చిత్రకథ లాపతా లేడీస్ చిన్న సినిమాగా వచ్చి.. అనూహ్య విజయాన్ని సాధించింది. ఓటీటీలో కూడా దుమ్ము రేపింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన కాన్సెప్టుతో దీనిని తెరకెక్కించారు. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో ఇది ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.