నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4 విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా వచ్చిన నాల్గవ ఎపిసోడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా పాల్గొని బాలకృష్ణతో సరదాగా ముచ్చటించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, తదితర హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
మీకు రొమాన్స్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా అని బాలకృష్ణ ప్రశ్నించగా, తొక్కలో యాక్షన్, రొమాన్స్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ తేల్చేశారు. హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు.
ప్రోమోలలో అత్యంత ఆసక్తి కలిగించిన సన్నివేశం, బాలకృష్ణ అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి ప్రశ్నించగా, అల్లు అర్జున్ పవన్ ముక్కుసూటి స్వభావం, తన భావాలపట్ల ఆయన చాలాధృడంగా ఉంటారని చెప్పారు. అలాగే, ప్రభాస్ గురించి ప్రశ్నించగానే, “ఆరడుగుల బంగారం” అని అభివర్ణించారు. ఇది చూశాక అభిమానులు పవన్ కళ్యాణ్‌పై అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలు అభిమానుల మధ్యనూ అనేక డిబేట్‌లకు కారణమవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం వల్ల ఈ విభేదాలు మరింతగా పొడవుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘అన్‌స్టాపబుల్’ షోలో అల్లు అర్జున్ పవన్ గురించి మాట్లాడటం అభిమానులకు కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ గురించి అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటారా అని అంతా అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.
ఇదే సమయంలో, అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప 2’ ప్రమోషన్ కోసం కూడా ఈ షోలో కనిపించాడు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.