జీ20 సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా.. సోమవారం ఉదయం బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియాలో ఉత్పాదక పర్యటన ముగించుకుని..ప్రధాని మోదీ దక్షిణ అమెరికా దేశానికి చేరుకున్నారు.
అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని.. అక్కడున్న భారతీయులతో కూడా సంభాషించారు. బ్రెజిల్‌లో మోదీ రాకను ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ పోస్ట్‌లో, ‘G20 బ్రెజిల్ సమ్మిట్‌కు హాజరవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జెనీరో చేరుకున్నారని తెలిపింది.
విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన ఫోటోలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. మరోవైపు తన రాకను ప్రకటిస్తూ మోదీ తన అధికారిక ఎక్స్ పోస్ట్‌లో G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ల్యాండ్ అయ్యానని మోదీ ట్వీట్ చేశారు. వివిధ ప్రపంచ నాయకులతో శిఖరాగ్ర చర్చలు, ఫలవంతమైన చర్చల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రెజిల్‌లో ప్రధాని మోదీ ట్రోయికా సభ్యునిగా 19వ G20 సమ్మిట్‌లో పాల్గొంటారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ G20 ట్రోయికాలో భాగం అన్న సంగతి తెలిసిందే. నవంబర్ 18 నవంబర్ 19 తేదీలలో జరిగే రియో డి జెనీరో శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులలో మోదీతో పాటు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అతని యుఎస్ కౌంటర్ జో బైడెన్ కూడా ఉన్నారు.
ఇక ప్రధాని మోదీ తన పర్యటన యొక్క మూడవ,చివరి దశలో నవంబర్ 19 నుంచి నవంబర్ 21 వరకు అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానంతో గయానాలో కూడా పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో విశేషత సంతరించుకుంది.