ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ..ఒక కీలక ప్రకటన చేసింది. అదానీ దాని అనుబంధ కంపెనీలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు ఇచ్చారన్న ఆరోపణల్లో.. గౌతమ్, ఆయన బంధువు సాగర్ పేర్లు లేవని చెప్పింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది.
స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ సందర్భంగా దీనిపై స్పందించిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ..అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వస్తున్న కథనాలను తప్పని.. అవన్నీ అవాస్తవమని కొట్టి పడేసింది. వీరంతా కూడా సెక్యూరిటీస్ సంబంధించిన మోసం ఆరోపణలను ఎదుర్కొంటున్నారే తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏమీ కూడా నమోదు కాలేదని వివరణ ఇచ్చింది. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదని అదానీ గ్రీన్ పేర్కొంది.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు ఆరుగురు 2020-24 మధ్య కాలంలో…సోలార్ పవర్ సప్లయ్ ఒప్పందాలు పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు అంటే 2,200 కోట్ల రూపాయల లంచాలు ఇవ్వడానికి అంగీకరించినట్లు న్యూయార్క్ కోర్టులో వారిపై నేరారోపణ నమోదు అయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌లయిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్పై.. యూఎస్ ఎస్ఈసీ ఈ అభియోగాలను మోపింది. ఇటీవల గౌతమ్, సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమన్లు కూడా జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి.