ఫోన్ ట్యాపింగ్ కేసు: సుప్రీంకోర్టులో తెలంగాణ పోలీసు అధికారి బెయిల్ పిటిషన్‌పై విచారణ

Phone Tapping Case: Supreme Court Hears Bail Petition Of Telangana Police Officer

తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారి తిరుపతన్న బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో సుప్రీంకోర్టు బెంచ్ తెలంగాణ ప్రభుత్వానికి రెండు వారాల సమయం మంజూరు చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 18వ తేదీకి వాయిదా వేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న ముందుగా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేసారు. అయితే, హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వకపోవాలని నిర్ణయించింది. తిరుపతన్నపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు అప్పట్లో తెలిపారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం ద్వారా దర్యాప్తు మీద ప్రభావం పడుతుందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలతో హైకోర్టు తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అంతకుముందు సుప్రీంకోర్టులో అక్టోబర్ 24న విచారణ జరిగింది. ఆ సమయంలో కూడా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. సుప్రీంకోర్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన మూడు నెలల తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ విచారణ జరిగి, తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది మరింత సమయం కావాలని కోరడంతో సుప్రీంకోర్టు మరో 2 వారాల సమయం మంజూరు చేసింది.