తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆహ్వానాలను అందించేందుకు వీరిని సంప్రదించి సమయం అడుగుతున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున అందరికీ ఆహ్వానాలు ఇచ్చి, వారి హాజరును కోరుతున్నామని, ముఖ్యంగా 9వ తేదీ జరగబోయే విగ్రహ ఆవిష్కరణలో ఈ నేతల హాజరుకు ప్రభుత్వ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలను ఈనెల 7, 8, 9 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల విజయవంతానికి సంబంధించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.