తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో కొనసాగించడం రిస్క్ అని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించినా, బౌలింగ్‌లో విఫలమవడంతో జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.
మంజ్రేకర్ ఏమన్నారు?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ రెండు టెస్ట్‌ల్లో నితీష్ కుమార్ రెడ్డి నాలుగు ఇన్నింగ్స్‌లలో 41, 38*, 42, 42 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కానీ బౌలింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసాడు.
“నితీష్ మంచి బ్యాటింగ్ టాలెంట్ చూపించినా, అతని బౌలింగ్ మిగతా బౌలర్లపై అదనపు ఒత్తిడి తెస్తోంది. టీమిండియా తుది జట్టు కాంబినేషన్‌పై పునరాలోచన చేయాలి. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యం అవసరం” అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.
అభిమానుల నిరసన
సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. “నితీష్ జట్టులో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంటే, అతన్ని తప్పించడం ఏమిటి? ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మను ఎందుకు తప్పించడం లేదు?” అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మూడో టెస్ట్ ఉత్కంఠ
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది.