ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదప్పటికీ, ప్రాథమికంగా గుర్తించిన లక్షణాల ఆధారంగా వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.
తొలుత ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందించారు. జికా వైరస్ లక్షణాలు ఉంటాయని అనుమానించి, అతని రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడి నివేదికలు వచ్చాకే ఈ కేసు జికా వైరస్‌కు సంబంధించినదా, లేక ఇతర ఇన్ఫెక్షన్దా అన్నది తేలనుంది.
జాగ్రత్త చర్యల్లో భాగంగా, వెంకటాపురం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి, అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తగిన చికిత్స అందిస్తున్నారు. గ్రామ ప్రజలను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
జికా వైరస్‌పై అవగాహన:
జికా వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రాణాంతకమేమీ కాదు కానీ గర్భిణి మహిళలకు ఇది తీవ్రమైన సమస్యలు కలిగించవచ్చు. ఈ వైరస్ సోకినప్పుడు పుట్టబోయే శిశువుకు తల చిన్నగా ఉండటం లేదా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. జికా లక్షణాలు జ్వరం, చర్మ దద్దుర్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు లాగా ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది జూన్‌లోనే కేంద్ర ఆరోగ్యశాఖ జికా వైరస్‌పై అవగాహన ప్రకటనలు జారీ చేసింది. గర్భిణిలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ కేసులు తేలితే శిశువుల ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించింది.