డ్వాక్రా సంఘాలు అంటే ఇప్పటివరకు మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనవి అని భావించేవారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 1995లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ సంఘాలు, మహిళల ప్రగతికి దోహదపడి మూడు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. పది నుంచి పదిహేను మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేసి, వారిలో పొదుపు అలవాటు చేసి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించటం డ్వాక్రా ప్రత్యేకత.
తాజాగా, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఈ విజయవంతమైన ఫార్ములాను పురుషులపై కూడా ప్రయోగించాలని వినూత్నంగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో పురుషుల కోసం కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (CIGs) అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ గ్రూపులు పురుషుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రధానంగా రూపొందించబడ్డాయి.
కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు:
ఈ గ్రూపుల ద్వారా భవన నిర్మాణ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, వాచ్ మెన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ప్రైవేట్ ఉద్యోగులు వంటి కార్మిక వర్గాలకు తక్కువ వడ్డీ రుణాలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు ఐదుగురి గ్రూపుగా ఏర్పడి బ్యాంకు అకౌంట్లు ప్రారంభించి రుణాలు పొందవచ్చు.
ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో 20 గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. డ్వాక్రా మాదిరిగానే రుణ పరిమితిని కూడా వీరికి పెంచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకు పునాది వేయగా, కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు పురుషులకు ఆర్థిక స్వావలంబన సుస్థిరతను అందించనున్నాయి. ఒకే రకమైన ఆసక్తి గల వ్యక్తులను గ్రూపులుగా చేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విధానం విజయవంతమైతే, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని ఇబ్బందులు పడే చిన్న వ్యాపారుల జీవితాలు మారిపోతాయి. సరళమైన ప్రాసెస్ ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.