భారీ బడ్జెట్‌ సినిమాలపై బెనిఫిట్ షోల రద్దు ప్రభావం

Impact Of Cancellation Of Benefit Shows On Big Budget Films

తెలంగాణలో ఇక నుంచి ఎలాంటి బెనిఫిట్‌ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలు పెంచబోమని ఇటీవల సర్కారు ప్రకటించడంతో భారీ బడ్జెట్‌ సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కొత్త మలుపులు తీసుకుంటూ చిత్ర పరిశ్రమ మెడకు చుట్టుకుంటోందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమౌతోంది. బెనిఫిట్‌ షోల రద్దు ప్రభావం వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమపై కనిపించనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్టార్‌ హీరోల సినిమాలకు ఎంతగానో అవసరం. భారీగా ఆరంభ వసూళ్లు తెచ్చుకోవడానికి అవే ఉపయోగపడతాయి. ఈ నెల 5న విడుదలైన పుష్ప 2 సినిమా తొలిరోజే ఏకంగా 294 కోట్లు రాబట్టడంలో బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు కీలక పాత్ర పోషించాయి. అయితే బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండబోదని సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో….. ఏటా సంక్రాంతికి విడుదలయ్యే పెద్ద హీరోల సినిమాలకు వసూళ్ల పరంగా బ్రేక్‌ పడేలా కనిపిస్తోంది.

450 కోట్ల భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్‌ ఛేంజర్‌ . దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో జనవరి 10న విడుదలవుతోంది. ఇక బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకూ మహారాజ్‌ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. ఇక వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు లేకపోతే ఈ సినిమాల వసూళ్లు దెబ్బతింటాయి. గేమ్‌ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు చెందిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ తాగాజ సమావేశమై బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే రాత్రి బెనిఫిట్ షోలు వద్దని.. కేవలం తెల్లవారుజామున 4 గంటలకు షో పడితే చాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం కూడా స్వాగతించింది.

కొంత కాలంగా భారీ బడ్జెట్‌ సినిమాలకు బెనిఫిట్‌ షోలు, కొన్ని రోజుల వరకూ టికెట్‌ ధరల పెంపు, అదనపు ఆటలకు వెసులుబాటు ఇవ్వడం జరుగుతోంది. ఒకప్పుడు ఎన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిందనేది సినిమా విజయానికి కొలమానంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్‌ డే వసూళ్లు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, వీకెండ్‌ వసూళ్లు ప్రామాణికంగా మారాయి. అలా, విజయం కోసం కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఝలక్‌ ఇచ్చిందంటున్నాయి పరిశ్రమ వర్గాలు.