అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లికి అంత ఖర్చు పెడుతున్నారా?

Expenditure on Amazon founder's second wedding

దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ త్వరలో తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇదివరకే నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 28న పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరి పెళ్లి కంటే ముఖ్యంగా పెళ్లి ఖర్చు గురించే తెగ చర్చ నడుస్తోంది. ఈ వివాహం కోసం దాదాపు 5 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అమెజాన్ ఫౌండర్, ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. గతంలో ఆయన మెకంజీ స్కాట్‌ను వివాహమాడటం.. విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను రెండో పెళ్లి చేసుకోనున్నారు. మరోవైపు ఆమెకు మూడో వివాహంగా తెలుస్తోంది. గత సంవత్సరమే వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ వారమే వీరి వివాహం జరగనుంది. కొలరాడోలోని అస్పెన్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నెల 28న ఇరువురూ ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ పెళ్లి కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 5096 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. నెట్టింట ఇది తెగ వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఊహాగానాలపై బెజోస్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన పెళ్లి ఖర్చు గురించి వస్తున్న ప్రకటనలన్నీ అసత్యాలేనని ట్విట్టర్ వేదికగా వివరించారు.