ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌కు, మెగా ఫ్యామిలీకి ఎప్పటికీ మర్చిపోలేని ఏడాది అనే చెప్పొచ్చు. నిజానికి మెగా కుటుంబం రాజకీయంగా సక్సెస్ ని చూడటానికి ఏకంగా 15 ఏళ్ల నుంచి కష్టపడుతోంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అంచనాలను అందుకోలేకపోకపోవడంో… ఆ పార్టీ ని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు.
దీంతో రాజకీయాలలో ఫైట్ చేయాలి కానీ.. ఇలా చేతులెత్తేయడం ఏంటని మదన పడ్డ పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో ‘జనసేన’ పార్టీ ని స్థాపించారు. అప్పటికి ఎన్నికల్లో పోటీ చేసేంత సమయం లేకపోవడంతో టీడీపీ, బీజేపీ పార్టీలకు జనసేన పార్టీతో సంపూర్ణంగా మద్దతు పలికి, కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. సక్సెస్ అయితే వచ్చింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఎంజాయ్ చేయలేదు.
ఆ తర్వాత 2019 వ సంవత్సరంలో విడిగా పోటీ చేసి ఘోరమైన పరాజయాన్ని అందుకున్న పవన్ ఎన్నో అవమానాలు ఫేస్ చేశారనే చెప్పొచ్చు. అయితే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో చేతులు కలిపి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర ప్రదేశ్ లో , కేంద్రంలో కూడా పవర్ లోకి రావడానికి ప్రధాన కారణంగా నిలిచారు.
డిప్యూటీ సీఎ గా బాధ్యతలు చేపట్టి, కేవలం ఏపీలో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ని శాసించే స్థాయికి ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్న పొలిటికల్ సక్సెస్ తో ఫుల్ హ్యాపీలో ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు.
పవన్ హీరో గా నటించిన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో.. వీటిల్లో ముందుగా ‘హరి హర వీరమల్లు’ మూవీ రిలీజ్ కాబోతుంది. 2025 మార్చి 28న విడుదల కాబోతున్న ఈ మూవీకి.. కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు మూవీ యూనిట్ చెబుతోంది. ఆ నాలుగు రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ కేవలం 16 గంటల సమయం కేటాయిస్తే షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టేనని అంటోంది.
ప్రస్తుతం పవన్ బిజీ గా ఉండటంతో.. ఈ నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. అయితే ఈ కొత్త ఏడాదిలో ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాటని.. డిసెంబర్ 31 వ తేదీన న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
మరోవైపు జనవరి నెల నుంచి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన అప్డేట్ రోజుకి ఒకటయినా వస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతీ అప్డేట్ సినిమా కంటెంట్‌ని తెలిపేలా ఉంటుందని తెలుస్తోంది. కంటెంట్ బయటకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సినిమానా అని పవన్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతారని, అంత అద్భుతంగా ఈ మూవీ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.