బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి తాజాగా ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఆసీస్ యువ బ్యాటర్ సామ్ కోన్స్టాస్‌తో జరిగిన గొడవలో ప్రవర్తన నియమావళిని అతిక్రమించాడని కోహ్లీపై 20% మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు.
ఏం జరిగింది?
మ్యాచ్ తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో పదవ ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో కోన్స్టాస్ ధాటిగా ఆడుతుండటంతో, ఒత్తిడిలో ఉన్న కోహ్లీ అతడితో గొడవకు దిగాడు. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లీ కోన్స్టాస్ భుజాన్ని తన భుజంతో ఢీకొట్టడం, ఆపై మాటల యుద్ధం చోటు చేసుకోవడం మ్యాచ్ రిఫరీ దృష్టికి వెళ్లింది.
ఈ ఘటనపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్రంగా స్పందించారు. కోహ్లీ ప్రవర్తన ఐసీసీ నియమావళికి వ్యతిరేకమని, సిడ్నీలో జరిగే చివరి టెస్ట్‌లో అతడిని ఆడనివ్వవద్దని పాంటింగ్ సూచించారు.
ఐసీసీ చర్యలు
కోహ్లీ తన తప్పు ఒప్పుకోవడంతో ఐసీసీ అతడిపై 20% మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ చేర్చింది. రెండు సంవత్సరాల్లో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే ఆటగాళ్లు క్రికెట్ ఆడకుండా నిషేధానికి గురవుతారని ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది కోహ్లీకి హెచ్చరికగా మారింది.
2019లో బెంగళూరులో దక్షిణాఫ్రికా బ్యాటర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌కి కోహ్లీ భుజం తగలడం, ఆ ఘటనపై కూడా డీమెరిట్ పాయింట్ నమోదు కావడం గుర్తుచేసుకుంటున్నారు. ఆ సమయంలోనూ కోహ్లీ తన తప్పును అంగీకరించాడు. కాగా ఇటీవలి కాలంలో టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న కోహ్లీకి తాజా వివాదం తీవ్ర ఒత్తిడిని తెచ్చిపెట్టింది. టీమిండియా జట్టుకే కాకుండా కోహ్లీ వ్యక్తిగత భవిష్యత్తుపైనా ఈ సంఘటన ప్రభావం చూపే అవకాశం ఉంది.
🚨 VIRAT KOHLI HAS BEEN FINED 20% OF HIS MATCH FEES…!!! 🚨 pic.twitter.com/UhQX85YWJf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2024
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024