కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత

Chetan Chauhan, Chetan Chauhan Death, Chetan Chauhan Died, Chetan Chauhan Died due to COVID-19, Chetan Chauhan Dies, COVID-19, Former Cricketer And UP Minister Chetan Chauhan Died, UP Minister, UP Minister Chetan Chauhan Died

టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర‌ మంత్రి చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ ‌గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఇతర సమస్యలతో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆగస్టు 16, ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి నుంచి వచ్చిన చేతన్ చౌహన్ 1969-1981 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు, 7 వన్డేలు ఆడారు. టెస్టుల్లో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తో కలిసి ఎన్నో కీలక ఓపెనింగ్ భాగస్వామ్యాలను నిర్మించారు. టెస్టుల్లో 16 అర్ధ సెంచరీలతో 2,084 పరుగులు చేశారు. 1981లో అర్జున అవార్డ్ దక్కించుకున్నారు.

భారత జట్టు మేనేజర్ గా, ఢిల్లీ చీఫ్ సెలెక్టర్ గా కూడా చేతన్ చౌహన్ సేవలందించారు. మరోవైపు ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. యూపీలోని అమ్రోహా నుంచి 1991, 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తూ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ చురుకైన పాత్రను పోషించారు. 2017 లో జరిగిన ఎన్నికల్లో నాగవాన్ సదత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. చేతన్ చౌహన్ మృతి పట్ల ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సహా పలువురు రాజకీయ నాయకులు, క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 9 =