ర్యాపిడ్ చెస్‌లో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం! రెండవ సారి ప్రపంచ చాంపియన్‌గా రికార్డు..

Koneru Humpy Creates History Again Crowned World Rapid Chess Champion, Koneru Humpy Creates History, World Rapid Chess Champion, Chess, Arjun Erigaisi’s Performance, Indian Chess Achievements, Koneru Humpy Wins Again, Viswanathan Anand On Humpy, World Rapid Chess Championship 2024, India, National News, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన హంపి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

ఇది హంపికి రెండో వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్. 2019లోనూ ఆమె ఈ ఘనత సాధించారు. చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ టైటిల్ గెలుచుకున్న అరుదైన ప్లేయర్‌గా హంపి నిలిచారు. మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో టోర్నీని ముగించారు.

సెప్టెంబర్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు స్వర్ణ పతకాలు దక్కిన వేళ, హంపి, హారిక ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

కోనేరు హంపి విజయం పట్ల భారత వెటరన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు గుప్పించారు. “హంపి అద్భుతమైన ప్రదర్శన చూపించి టైటిల్ గెలుచుకున్నారు. చివరి రౌండ్‌లో ఆమె తన క్లాస్‌ను ప్రదర్శించారు,” అని ఆనంద్ పేర్కొన్నారు.

పురుషుల విభాగంలో, భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి నిరాశ చెందారు. తొమ్మిది రౌండ్ల వరకు అగ్రస్థానంలో ఉన్న అర్జున్ చివర్లో ఓటమిని ఎదుర్కొని ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. 18 ఏళ్ల రష్యన్ టీనేజర్ వోలాదర్ ముర్జిన్ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు.

సెప్టెంబర్ నెలలో భారత్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంలో అర్జున్, గుకేశ్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే.