భారతీయ మహిళలకు బంగారంపై అమితమైన ప్రేమ. పండుగలకు, శుభకార్యాలకు పసిడిని ఎక్కువగా కొంటుంటారు. దీనివల్ల మన దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల గోల్డ్ జమైంది. ఇది ప్రపంచంలోనే టాప్-దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువని..ప్రపంచంలోనే గోల్డ్ రిజర్వుల్లో 11శాతానికి సమానమని లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తేల్చింది.
భారత్లో బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉంది. ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారంవైపు చూస్తున్నారు. భారీ ఎత్తున నగలు, గోల్డ్ కడ్డీలు కొంటున్నారు. అమెరికాలో మొత్తం 8 వేల టన్నుల బంగారం ఉంటే, జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ లో 2వేల టన్నులు, రష్యాలో 1900 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి.. ఈ ఐదు దేశాల దగ్గరున్న మొత్తం బంగారం కూడా ఇండియాలోని బంగారానికి సమానం కాదు.వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల వద్ద 25 వేల టన్నుల బంగారం ఆభరణాల రూపంలో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ , స్విట్జర్లాండ్ వంటి ధనిక దేశాల కంటే కూడా ఇండియాలో బంగారం ఎక్కువగా ఉంది.
మన దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దక్షిణ భారతంలో పసిడి వాడకం ఎక్కువ అని స్టడీ వెల్లడించింది. దేశంలోని మొత్తం బంగారు నిల్వలలో 40 శాతం నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ విషయంలో తమిళనాడు వాటా 28 శాతం ఉంది. 2023 నాటికి భారతీయ కుటుంబాల దగ్గర 25వేల టన్నుల బంగారం ఉంది. బంగారం నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. దీని విలువ దేశ జీడీపీలో 40 శాతం వరకు ఉంటుంది. మన దేశంలో బంగారం కొనడం, అమ్మడం కోసం 3శాతం జీఎస్టీ ఉంటుంది.
మరోవైపు బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా భారీగా లాభాన్ని ఇస్తున్నాయి. ధరలు వేగంగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. 2024లో పుత్తడి ధరలు నవంబరు నాటికే 28 శాతం పెరిగాయి. మూడో క్వార్టర్లో డిమాండ్ విలువ వంద బిలియన్ డాలర్లకు చేరింది. వ్యక్తులతోపాటు సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా కొంటున్నాయి. దీనివల్ల కొత్త సంవత్సరంలోనూ పసిడికి మరింత డిమాండ్ ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.