కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణం కొనసాగుతోంది. పరస్పర రాజకీయ విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏపీ సీఎం చంద్రబాబు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత మాత్రం కొనసాగుతూనే ఉంది.
నిజానికి తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత.. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందోనని ఎదురుచూసిన ప్రజలకు.. సానుకూల వాతావరణం కనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఐదేళ్ల కిందట ఏపీలో జగన్, తెలంగాణలో కెసీఆర్ ప్రభుత్వాలు నడిచాయి. కానీ వారి మధ్య స్నేహం పాలిటిక్స్ వరకే పరిమితం అయ్యింది తప్ప తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడలేదన్న కామెంట్స్ గట్టిగా వినిపించాయి.
తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. పార్టీలు వేరయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణమే నడుస్తోంది. దానికి కారణం సీఎం చంద్రబాబు, ఆయన ఒకప్పటి సన్నిహితుడు అయిన రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉండటమే. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు కూడా.
అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ విదేశీ గడ్డపై కలవనుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురెదురు పడనున్నారు. జనవరి 20 నుంచి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్‌లో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడం ముఖ్యమంత్రుల విధి కాబట్టి.. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య గట్టి ఫైట్ నడిచే అవకాశం ఉంది.
కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15 నుంచే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అటు దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు రానున్నారు.ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన మంత్రివర్గ సహచరులతో దావోస్ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగనుంది. దీంతో ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వస్తాయా? తెలంగాణకు రేవంత్ ఎక్కువ పెట్టుబడులు తీసుకువస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
2024 జనవరిలో జరిగిన పెట్టుబడుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 40 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను సాధించారు. అదే సమయంలో ఏపీ నుంచి జగన్ ప్రభుత్వం ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక పోయింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అది కూడా కారణమని విశ్లేషకలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నారా చంద్రబాబు కాబట్టి.. గతంలో లాగే రేవంత్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాగలరా అన్న చర్చ నడుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలరనేది ఆసక్తి కరంగా మారింది.