తెలంగాణ రాష్ట్రం చలి కాటుకు వణికిపోతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో ప్రజలు తీవ్ర చలి వేళను ఎదుర్కొంటున్నారు. ఉదయం బయటకు రావాలంటేనే భయపడుతుండగా, వైద్యులు చలి తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా తిర్యాని మండలంలోని గిన్నెదరిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, సిర్పూర్(యు)లో కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదైంది. కేరమెరిలో 9.3 డిగ్రీలు, దనోరాలో 9.8 డిగ్రీలు వాతావరణాన్ని మరింత చల్లబరచాయి.
ఇక మెదక్ జిల్లాలో టేక్మాల్‌లో 9.3 డిగ్రీలు, నర్సాపూర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9 డిగ్రీలు, న్యాల్‌కల్‌లో 7.7 డిగ్రీలు, ఆల్గోల్‌లో 7.6 డిగ్రీలు నమోదయ్యాయి.
జాతీయ రహదారులపై పొగమంచు ముసురడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణుల ప్రకారం రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు మొదలవుతుండగా, రాత్రిళ్ళు వాతావరణం మరింత చల్లబడుతుంది.
చలి తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయకుండా ఉండాలని, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సలహా ఇస్తున్నారు.