ఇన్ని రోజులూ రెండడుగులు ముందుకి, ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో ట్రైన్ వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. పాతబస్తీ ప్రాంతంలో మెట్రో విస్తరణ కోసం ఆస్తులు కోల్పోతున్నవారికి చెక్కులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆ ఆస్తులన్నీ హైదరాబాద్ మెట్రోకు సొంతం కాబోతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌లో మెట్రో మూడో దశ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట మార్గంలో భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పాత బస్తీకి మెట్రో విస్తరించాలని, అక్కడి చారిత్రక ప్రాంతాలకు వెళ్లటానికి పర్యాటకుల రాకపోకలకు మార్గం ఈజీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటే.. ఆ ప్రాంతాన్ని మెట్రో ద్వారా హైదరాబాద్‌తో అనుసంధానించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7 కి.మీటర్ల మెట్రో రైలు మార్గంలో ఇప్పటివరకు 1,100కు పైగా ప్రభావిత ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటి స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఆ ఆస్తుల యాజమానులతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇటీవల చర్చలు జరిపింది. ఆస్తులను అప్పగించిన వారికి చదరపు గజానికి 81 వేల రూపాయలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. అయితే యజమానులతో ఇంకా అధికారులు దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు.
మరోవైపు ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి పత్రాలు సమర్పించిన 169 మందికి..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద చెక్కులను అందజేయబోతోంది ఆస్తుల యజమానులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెక్కుల్ని అందజేయనున్నారు.
ఆస్తుల స్వాధీనానికి అనుమతి పత్రాలు సమర్పించిన వారు నష్టపరిహార చెక్కుల్ని అందుకున్న తర్వాత.. అక్కడ నిర్మాణాల్ని కూల్చే పనుల్ని ప్రారంభించబోతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారమే అక్కడి స్థలాల సేకరణతో పాటు నష్టపరిహారం చెల్లింపులు కూడా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఈ ప్రాంతంలోని మతపరమైన, సున్నిత ప్రాంతాలకు ఎటువంటి హాని కలగకుండానే మెట్రో నిర్మాణం చేపడతామని ప్రకటించిన ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో రైలు నిర్మాణం చేపట్టాక ఓల్డ్ సిటీకి కొత్త అందాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మెట్రో ప్రాజెక్ట్ వల్ల అక్కడి వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పాత నగరం..కాలుష్య రహితంగా తయారవుతుందని చెప్పుకొచ్చారు.