నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ లాగ బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో అన్పిస్తుంది నిన్న అల్లు అర్జున్ పరామర్శ తర్వాత. ఎందుకంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తపన పడుతూ వెళ్లిన తర్వాత..బాబును చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురవడం ఆయన మనస్తత్వాన్ని చాటుతోంది. తనెంత మానవత్వవాది అనేది చూపుతోంది. సాటి మనిషి కష్టాన్ని తనదిగా భావించే బన్నీ వ్యక్తిత్వం బయటపడుతుంది.
నిజానికి ఘటన జరిగిన తర్వాత తనకు తెలియగానే ఆ బిడ్డ భవిష్యత్తుకి బాధ్యత తనదేనని బన్నీ చెప్పారు. అంతేగాకుండా తన బిడ్డతో సమానమంటూ తనలోని తండ్రి గుణాన్ని చాటుకున్నారు. అంతగా తన తీరు చాటుకున్న అల్లు అర్జున్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు శ్రీతేజ్‌తో ఏకాంతంగా మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా తనకు సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేందుకు తగిన అండదండలు అందిస్తామని చెప్పడమే కాకుండా.. పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చాలా విషయాలు మాట్లాడుకుందామని అల్లు అర్జున్ హామీ ఇచ్చిన తీరుతో… శ్రీతేజ్ ఎంతో ఆనందాన్ని పొందినట్టు ఆస్పత్రి వర్గాలు , కుటుంబీకులు చెబుతున్నారు.
తమ అభిమాన నటుడిని చూడడమే పెద్ద వరంగా భావించే శ్రీతేజ్.. నేరుగా అల్లు అర్జున్ తనతో అంత సమయం వెచ్చించే సరికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని సాధించినట్టుగా శ్రీతేజ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. తాను ఆస్పత్రి నుంచి రిలీవ్ కాగానే అల్లు అర్జున్ ఇంట్లో చాలా సమయం అన్ని కబుర్లు చెప్పుకోవచ్చంటూ హామీ రావడంతో తను కోలుకోవడానికి ఎంతో దోహదపడే అంశంగా భావిస్తున్నారు. మరో మూడు, నాలుగు వారాలయినా ఆస్పత్రిలో ఉండక తప్పదని డాక్టర్లు చెబుతున్న ఈ సమయంలో బన్నీ అందించిన భరోసా..బాబుకు బూస్ట్ లా పనిచేస్తుందని భావిస్తున్నారు. బాబు త్వరగా కోలుకోవడానికి దోహదపడే విషయంగా అంచనా వేస్తున్నారు.
అల్లు అర్జున్ కూడా ఎంతో భావోద్వేగంతో బాబు మీద ఆపేక్షను ప్రదర్శించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదో సాధారణంగా పరామర్శ, పలకరించి రావడం కాకుండా తనకోసం నేనున్నానంటూ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. ముఖ్యంగా తన చుట్టూ ఉన్న వారందరినీ బయటకు వెళ్లమని, తానొక్కడే బాబుతో అంత సమయం గడిపిన తీరు ఆకర్షించింది. ఇలాంటి అప్యాయత ప్రదర్శించే నటులు అరుదుగా ఉంటారన్న కామెంట్లు నెట్టింట్లో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మనసులో ఆ బాబు స్థానాన్ని చాటుతోందన్న బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చిన తర్వాత.. అల్లు అర్జున్ అతనికి పూర్తి అండదండలు అందించడానికి, అండగా నిలవడానికి సిద్ధపడిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నామమాత్రపు పరామర్శ, ప్రచారం కోసం చేసిన ప్రయత్నంలా కాకుండా మనస్ఫూర్తిగా వ్యవహరించిన అల్లు అర్జున్ ని అంతా అభినందిస్తున్నారు.