హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో ఎప్పటినుంచో ఉన్న విధానాన్ని మారుస్తూ అమెరికా సరికొత్త నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఇప్పుడు స్వదేశానికి రాకుండానే అమెరికాలో తమ వీసా రెన్యువల్ చేసుకోవచ్చు. అమెరికా త్వరలో వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందని, దీని కింద హెచ్1బీ వీసా హోల్డర్లు దేశం విడిచి వెళ్లకుండానే తమ పత్రాలను పునరుద్ధరించుకోవచ్చని న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ తెలిపింది. ఇప్పటికే హెచ్-1బీ వీసా రెన్యువల్ కోసం అమెరికా ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.
హెచ్1బీ వీసా హోల్డర్ల కోసం యూఎస్ ఆధారిత పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వివిధ రకాల నిపుణులు, భారతీయ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తమ వీసాను పునరుద్ధరించడానికి స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంటుంది. హెచ్1బీ వీసాలను రెన్యూవల్, రీఫిల్ చేయడానికి భారతదేశానికి తిరిగి రావడం యూఎస్లో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులకు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తుంది. హెచ్1బీ వీసాలను పునరుద్ధరించే పైలట్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇది సాధ్యమైందని యూఎస్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పైలట్ ప్రోగ్రామ్ వేలాది మంది దరఖాస్తుదారుల వీసాలను పునరుద్ధరించింది.
మరోవైపు అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మూడు వారాల ముందు హెచ్1బీ వీసాపై చర్చ జరుగుతోంది. దీని కారణంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలలో విభేదాలు తలెత్తాయి. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో…ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది.