కెనడా రాజకీయాల్లో మలుపు తిరిగింది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం, దేశ కొత్త నాయకుడి కోసం జరుగుతున్న అన్వేషణలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అనితా కెనడా ప్రధానమంత్రిగా ఎన్నికవడమేనా అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
అనితా ఆనంద్ పుట్టిపూర్వోత్తరాలు
నోవా స్కోటియాలోని కెంట్‌విల్లేలో 1967లో జన్మించిన అనితా ఆనంద్ భారతీయ మూలాలున్న కుటుంబం నుండి వచ్చారు. ఆమె తల్లి సరోజ్ దౌలత్‌రామ్ పంజాబ్‌కు చెందిన అనస్తీషియాలజిస్ట్, తండ్రి సుందరం వివేక్ తమిళనాడుకు చెందిన జనరల్ సర్జన్. 1960వ దశకంలో వారు నైజీరియాలో నివసించి, తర్వాత కెనడాలో స్థిరపడ్డారు.
ఆక్స్ఫర్డ్ నుంచి రాజకీయాల వరకూ
అనితా తన విద్యా ప్రస్థానం పొలిటికల్ స్టడీస్‌లో డిగ్రీతో ప్రారంభించి, ఆక్స్ఫర్డ్ మరియు డల్హౌసీ యూనివర్సిటీల్లో న్యాయ విద్యను పూర్తి చేశారు. కార్పొరేట్ లాయర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, కొన్ని ప్రముఖ లా యూనివర్సిటీలలో లెక్చరర్‌గా పనిచేశారు.
2019లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓక్‌విల్లే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అనితా రాజకీయ అరంగేట్రం చేశారు. పబ్లిక్ సర్వీసెస్ మినిస్టర్‌గా, ఆ తర్వాత రక్షణ మంత్రిగా సాయుధ దళాల్లో సంస్కరణలు తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా ఉన్న అనితా, కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఆందోళనల మధ్య జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, అనితా ఆనంద్‌తో పాటు క్రిస్టియా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ వంటి ప్రముఖ నేతల పేర్లు ప్రధానమంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. కానీ అనితా భారతీయ మూలాలు కలిగిన తొలి మహిళగా కెనడా ప్రధానిగా రికార్డు సృష్టించవచ్చని భావిస్తున్నారు.
అనితా ఆనంద్ కథ అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం. ఆమె కెనడా ప్రధాని పదవి సాధిస్తే, అది భారతీయుల విజయగాథకు మరో గౌరవం. కెనడా లిబరల్ పార్టీ కొత్త నేతను మార్చి 24కి ఎంపిక చేసే అవకాశం ఉంది, అప్పటికి ఈ ఉత్కంఠకు తెరపడవచ్చు.