భారత క్రికెట్ జట్టు తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా మరోసారి గాయాలతో సతమతమవుతున్నాడు. గత సంవత్సర కాలంలో టాప్ ఫామ్‌లో ఉన్న బుమ్రా, వన్డే వరల్డ్ కప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2024, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కానీ, సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పి కారణంగా అతను మైదానం వీడాడు. ఇప్పుడు, వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి అతను అందుబాటులో ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడిన తరువాత, అతడి వెన్ను గాయానికి సంబంధించి బీసీసీఐ అతడిని న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ షౌటెన్‌ను సంప్రదించనుంది. గతంలో కూడా డాక్టర్ రోవాన్ గాయం చికిత్సలో కీలకపాత్ర వహించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్, రోవాన్ షౌటెన్ కలిసి చికిత్సపై చర్చలు జరుపుతున్నారు. అయితే, బుమ్రా కోలుకునేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
జనవరి 12వ తేదీలోపు చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది. బుమ్రా ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా అందుబాటులో లేకపోతే, భారత బౌలింగ్ దళానికి ఇది భారీ నష్టంగా భావిస్తున్నారు.
కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రాకు అప్పగించడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా బుమ్రా గాయాల బారిన పడే అవకాశం ఉందని, అతనిని కేవలం బౌలింగ్‌పైనే దృష్టి పెట్టేలా చూడాలని సూచించాడు. బుమ్రా బౌలింగ్‌లో కీలక పాత్ర వహించే ఆటగాడని, అతనిపై అదనపు ఒత్తిడి పెట్టకూడదని పేర్కొన్నాడు.
బుమ్రా గాయానికి సంబంధించి బీసీసీఐ తీసుకునే నిర్ణయం కీలకం. అతడు చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోతే, భారత జట్టుకు కొత్త స్ట్రాటజీ రూపొందించాల్సి ఉంటుంది. బుమ్రా గాయం, రికవరీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కానీ, చాంపియన్స్ ట్రోఫీకి అతని గైర్హాజరీ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ కాబోతోంది.