సెబీ, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మధ్య ఏర్పడిన వివాదం భారత మార్కెట్, రెగ్యులేటరీ వ్యవస్థతో పాటు కంపెనీ నైతికతలను ప్రశ్నించేలా చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ షార్ట్ సెల్లింగ్ వ్యాపార మోడల్‌ను అనుసరిస్తుంది. సంస్థలు లేదా వ్యక్తులపై నివేదికలు రూపొందించి, వాటి షేర్ల ధర పడిపోవడం ద్వారా లాభాలు పొందటం దీని ప్రధాన వ్యూహం. అదాని గ్రూప్‌పై హిండెన్ బర్గ్ నివేదిక పలు ఆరోపణలు చేసింది.
అదాని గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, తప్పుడు ఆర్థిక సమాచారాన్ని అందించిందని ఆరోపించింది. టాక్స్ హేవన్‌ల ద్వారా విదేశీ ఫండ్‌లను ఉపయోగించి మార్కెట్‌పై ప్రభావం చూపించిందని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం, అదాని గ్రూప్ అనుమానాస్పద లావాదేవీల ద్వారా 20,000 కోట్ల విలువైన షేర్ల ధరను తప్పుడు మార్గంలో నియంత్రించిందని ఆరోపించింది. ఈ నివేదిక వల్ల అదాని గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ తాత్కాలికంగా 5 లక్షల కోట్ల వరకు తగ్గిపోయింది. భారత స్టాక్ మార్కెట్‌లో ఆందోళన నెలకొంది.
మరోవైపు హిండెన్‌బర్గ్ నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తు ప్రారంభించింది. అదాని గ్రూప్ విదేశీ ఫండ్‌లతో లావాదేవీల నియంత్రణ , నియమాలను ఉల్లంఘించిందా..? టాక్స్ హేవన్ ఫండ్‌ల ద్వారా భారత మార్కెట్‌పై ప్రభావం చూపించారా…?అనే అంశాలను సెబీ పరిశీలించింది. సెబీ చైర్‌పర్సన్ మాదబి పూరిబచ్ విదేశీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ అంశం సెబీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
ప్రధానంగా సెబీ 2023లో అదాని గ్రూప్‌పై 24 ప్రముఖ లావాదేవీలను విచారించింది.విదేశీ పెట్టుబడులను నిబంధనల ఉల్లంఘనలపై 100 పేజీల నివేదికను సబ్‌మిట్ చేసింది. అయితే అదాని గ్రూప్ షేర్ల పతనం వల్ల భారత మార్కెట్‌లో కొంతకాలం ఆందోళన నెలకొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం భారత మార్కెట్ ప్రతిష్టపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక సెబీపై నైతిక ప్రశ్నలు లేవనెత్తడంతో, రెగ్యులేటరీ వ్యవస్థల్లో పారదర్శకతను మెరుగుపరచడం అనివార్యమైంది. అయితే ఈ వివాదం భారత మార్కెట్ విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నించగలదని భావించబడింది.
హిండెన్‌బర్గ్ నివేదిక పెద్ద కంపెనీల ఆర్థిక దోపిడీలను బహిర్గతం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు కనిపించింది.అయితే, నివేదికలు రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌ను పూర్తిగా అనుసరించలేదని విమర్శలు ఉన్నాయి. సెబీ చైర్‌పర్సన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలు సంస్థ విశ్వసనీయతకు ముప్పుగా మారాయి.పారదర్శకత, నిష్పక్షపాతమైన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సెబీ తన ప్రతిష్టను నిలుపుకోగలదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సంఘటన భారత మార్కెట్ వ్యవస్థకు ఒక హెచ్చరికలా మారింది.
రెగ్యులేటరీ వ్యవస్థలు మరింత పటిష్టంగా మారి, పెద్ద కంపెనీల లావాదేవీలపై కఠినమైన నియంత్రణలు విధించాల్సిన అవసరాన్ని తెలిపినట్లైంది. భారత దేశం ఆర్థికవ్యవస్థను మరింత విశ్వసనీయంగా చేయాలంటే, సెబీ వంటి సంస్థలు తమ నిబద్ధతను ప్రదర్శించాలి. నివేదికలను గుణపాఠంగా తీసుకుని, మరింత పారదర్శకమైన మార్కెట్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది. హిండెన్‌బర్గ్ నివేదికలు భారత మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావాన్ని చూపినప్పటికీ, దీర్ఘకాలిక స్థిరత్వం మాత్రం ప్రభావితమవలేదు. అయితే, అదాని గ్రూప్‌పై ఈ ఆరోపణలు భారత మార్కెట్ రెగ్యులేటరీ వ్యవస్థలో పలు నైతిక ప్రశ్నలను లేవనెత్తాయి.